భారతదేశంలో ఆరోగ్య సేవల్లో ఏఐ వినియోగం ముందంజలో: డాక్టర్లకంటే ముందు 85% మంది రోగులు ఏఐ సలహా
మన తొలివెలుగు తెలంగాణ బ్యూరో రిపోర్టర్ కానుగుల సాయికిషోర్
ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (ఏఐ) భవిష్యత్తుపై ఇంకా చర్చలు కొనసాగుతుండగా, భారతదేశంలో మాత్రం రోగులు ఇప్పటికే దీనిని విస్తృతంగా ఉపయోగిస్తున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్
(బీసీజీ) నిర్వహించిన సర్వే ప్రకారం, భారత్‌లో 85 శాతం మంది రోగులు డాక్టర్‌ను సంప్రదించే ముందు ఏఐ ఆధారిత ప్లాట్‌ఫార్మ్‌లను ఆశ్రయిస్తున్నారు. వినియోగదారులు ఏఐ ఆధారిత ఆరోగ్య సంరక్షణకు సిద్ధంగా ఉన్నారు. ఆరోగ్య వ్యవస్థలు కూడా సిద్ధంగా ఉండాలి.
పేరుతో విడుదలైన ఈ నివేదికలో భారత్ ఇతర దేశాల కంటే ముందంజలో ఉందని స్పష్టం చేసింది. అమెరికాలో 50%, యుకేలో 43%, జపాన్‌లో 34% మంది మాత్రమే ఆరోగ్య సంబంధిత విషయాల్లో ఏఐను వినియోగిస్తుండగా, గ్లోబల్ సగటు 60%గా నమోదైంది.
ఈ సర్వేలో 15 దేశాల నుంచి 13,000 మందికి పైగా వినియోగదారుల అభిప్రాయాలను విశ్లేషించారు. ఇందులో ముఖ్యంగా భారత యువత ఏఐ వినియోగాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు తేలింది. జనరేషన్ Zలో 78% మరియు మిల్లేనియల్స్‌లో 71% మంది మొదట డాక్టర్‌ను సంప్రదించకుండా ఏఐ టూల్స్ ద్వారా లక్షణాలు, చికిత్సలపై సమాచారం సేకరిస్తున్నారు.
స్థానికంగా కూడా ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది ముందుగా మొబైల్ యాప్‌లు లేదా చాట్‌బాట్‌ల ద్వారా ఆరోగ్య సమస్యలపై సమాచారం తెలుసుకుని తర్వాత మాత్రమే ఆసుపత్రులకు వెళ్తున్నారు.
ఏఐ ప్లాట్‌ఫార్మ్‌లు తక్కువ ఖర్చుతో, తక్షణ సమాచారం అందించడం వల్ల ప్రజలు వాటిపై ఆధారపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎక్కువగా 33% మంది చాట్‌బాట్‌లు, 19% మంది వేర్‌బుల్ పరికరాలను వినియోగిస్తున్నట్లు సర్వే తెలిపింది. భవిష్యత్తులో డాక్టర్ అపాయింట్‌మెంట్‌లు బుక్ చేయడం, మందుల పరస్పర ప్రభావాలను గుర్తించడం వంటి సేవల కోసం కూడా ఏఐపై డిమాండ్ పెరుగుతోంది.
అయితే, ఎక్కువ మంది భారతీయులు ఏఐ పూర్తిగా డాక్టర్లను భర్తీ చేయాలని కోరుకోవడం లేదు. డాక్టర్లు మరియు ఏఐ కలిసి పనిచేసే “హైబ్రిడ్ మోడల్”నే ప్రజలు ఇష్టపడుతున్నారని నివేదిక స్పష్టం చేసింది. ఇందులో ఏఐ టెస్ట్ రిపోర్టులను విశ్లేషించడం, దీర్ఘకాలిక వ్యాధుల నిర్వహణలో డాక్టర్లకు సహాయపడే విధంగా ఉపయోగపడనుంది.