INSTALL DEMO
Newspaper Banner
Date of Publish : 22 April 2026, 9:06 pm Posted by : MANA TOLIVELUGU

విజయ్ చరిత్ర సృష్టిస్తాడా, చతికిలబడతాడా..?

సీనియర్ జర్నలిస్ట్ శ్రావణ్ బాబు తమిళనాడు రాజకీయాలపై విశ్లేషణ చేస్తూ.. మీ కోసం అందిస్తున్న ప్రత్యేక కథనం..

విజయ్ ను ఒక విషయంలో మెచ్చుకోవాలి. రజనీకాంత్ చేయలేకపోయిన రాజకీయరంగ ప్రవేశమనే సాహసాన్ని చేసినందుకు. రాజకీయాలలో ప్రవేశించటమే కాదు, బీజేపీ, కాంగ్రెస్, అన్నాడీఎంకే వంటి ఎన్నిపార్టీలు పొత్తు పెట్టుకుందామన్నా, నిరాకరించి ముఖ్యమంత్రి కావటమే లక్ష్యంగా ఒంటరిగా ఎన్నికల బరిలోకి దూకారు. మరి అతను ఈ ఎన్నికల తర్వాత కింగ్ అవుతాడా, కింగ్ మేకర్ అవుతాడా, అసలు అతని ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది పరిశీలిద్దాం.

తమిళనాడులో ఇప్పటివరకు సినీరంగంనుంచి అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత రాజకీయాలలో ప్రవేశించి ముఖ్యమంత్రులయ్యారు. వారి బాటలోనే సీఎమ్ అవ్వటం లక్ష్యంగా విజయ్ వచ్చారు. అయితే ఇక్కడ ఒక తేడా ఉంది. వారందరూ రాజకీయాలలోకి ఓవర్ నైట్ వచ్చి ముఖ్యమంత్రులైపోలేదు. ఎంతోకాలం రాజకీయాలలో ఢక్కాముక్కీలు తిని, విశేష అనుభవం గడించిన తర్వాత ప్రజల మెప్పు పొంది ముఖ్యమంత్రులయ్యారు.

విజయ్ ప్రస్తుతం తమిళంలో నంబర్ వన్ హీరో. సినీ కుటుంబంనుంచే వచ్చారు. అతని తండ్రి చంద్రశేఖర్ ప్రముఖ దర్శకుడు. ఆయనే అతనిని హీరోగా లాంచ్ చేశారు, మెంటార్ చేశారు, ప్రణాళికాబద్ధంగా అతని కెరీర్ ను నిర్మించారు. డాన్సులు, కామెడీ, ఫైట్స్ విజయ్ బలాలు. అతని ఖాతాలో అనేక బంపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. వాటిలో అనేక సినిమాలు తెలుగు రీమేకులు కావటం విశేషం. మహేష్ ఒక్కడు, పోకిరి సినిమాల రీమేకులు అతనికి మంచి లైఫ్ ఇచ్చాయి. పవన్ కళ్యాణ్ తమ్ముడు, బద్రి సినిమాల రీమేకులలో కూడా నటించి విజయ్ హిట్లు కొట్టారు. తన నటనలో అక్కడక్కడా పవన్, మహేష్ ఛాయలు కనబడుతుంటాయి. ప్రస్తుతం ఒక్కో సినిమాకు విజయ్ దాదాపు రు.150 కోట్లు తీసుకుంటారు.

2024 ఫిబ్రవరి 2 న తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీని ప్రారంభించారు. తమకు రాజకీయ శత్రువు డీఎంకే అని, సైద్ధాంతిక శత్రువు బీజేపీ అని ప్రకటించారు. అవినీతి నిర్మూలన, సామాజిక న్యాయం, తమిళ ఆత్మగౌరవం లక్ష్యాలని వక్కాణించారు. పార్టీ ప్రారంభించి రెండేళ్ళు పైనే అయినప్పటికీ 7-8 నెలలనుంచే చురుకుగా కార్యకలాపాలు నడుపుతున్నారు. అది కూడా, మొదట్లో కేవలం శని, ఆదివారాలలో మాత్రమే సభలలో పాల్గొనేవారు.

విజయ్ అనుకూల అంశాలు

1. దశాబ్దాలుగా డీఎంకే, అన్నాడీఎంకే… రెండు పార్టీల పాలకులనే చూసి విసిగిపోయిన ప్రజలకు ఇప్పుడు విజయ్ ద్వారా ఒక మూడో ఛాయిస్ ఏర్పడింది. ఆ రకంగా విజయ్ పార్టీ టీవీకేకు ఒక అడ్వాంటేజ్ ఏర్పడింది. దానికితోడు కొత్త పార్టీ కావటంతో అవినీతి మరక ఉండదు.

2. పాపులర్ హీరో కావటంతో విజయ్ పై యువతలో బాగా ఆకర్షణ ఉంది. అతనంటే ప్రాణాలిచ్చే యువతీ యువకులు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా జెన్ జీ విజయ్ సభలకు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. అయితే వారందరూ విజయ్ పార్టీకి ఓట్లు వేస్తారా అనేదే ఇక్కడ వేచి చూడాల్సిన విషయం.

3. విజయ్ క్రైస్తవ మతానికి చెందినవారు కావటంతో ఆ వర్గం ఓట్లను బాగా ఆకర్షించే అవకాశం ఉంది.

4. విజయ్ కు నిధుల కొరత లేదు. లాటరీ కింగ్ గా తమిళనాడులో చెప్పుకునే అథర్వ అర్జున్ అనే అతను టీవీకేకు నిధులు సమకూరుస్తున్నాడని అంటున్నారు.

5. విజయ్ ఎంతోకాలంనుంచి దానాలు, విరాళాలు పెద్ద సంఖ్యలో చేశారు, విద్యార్థినీ, విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు.

విజయ్ ప్రతికూల అంశాలు

1. పార్టీకి సరైన వ్యవస్థాగత నిర్మాణం లేదు. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నాయకత్వం లేదు.

2. కరూర్ తొక్కిసలాట ఘటనలో 40 మంది చనిపోయిన ఘటన ఒక పెద్ద మరకగా మిగిలిపోయింది. ముఖ్యంగా ఆ ఘటనపై విజయ్ స్పందించిన తీరు ఆక్షేపణీయంగా ఉంది. ఘటన జరిగిన వెంటనే విజయ్ మీడియాకు దొరకకుండా పారిపోవటం, రెండు రోజుల తర్వాత మీడియాకు వీడియో బైట్ పంపించటం. ముఖ్యంగా, ఆ బైట్ లో కూడా ఎక్కడా అతని ముఖంలో జరిగినదానికిగానూ బాధపడుతున్న ఛాయలు కొద్దిగా కూడా కనబడకపోవటం. అతను అలా కాకుండా, కనీసం మరుసటి రోజైనా పోలీస్ ప్రొటెక్షన్ తో వచ్చి బాధితులను పరామర్శించి, వారికి తగిన సహాయం అందేలా చర్యలు తీసుకుని ఉంటే మంచి పేరు వచ్చిఉండేది.

3. పార్టీ ప్రచార కార్యక్రమాలు, సభలలో విజయ్ చురుకుగా పాల్గొనకపోవటం. బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లూ జరిగిన తర్వాత చివరి క్షణంలో అతను దానిని క్యాన్సిల్ చేసుకుని వీడియో సందేశం పంపుతున్నారు. దీనిపై సభకు వచ్చినవారిలో, అతని అభిమానులలో కూడా అసంతృప్తి ఏర్పడుతోంది.

4. విజయ్ వైవాహిక జీవితం రోడ్డెక్కటం మరో మైనస్ పాయింట్. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే అతని భార్య సంగీత విడాకులకోసం కోర్టు మెట్లు ఎక్కారు. అతనికి ఒక ప్రముఖ నటితో సంబంధం ఉందని ఆమె విడాకుల పిటిషన్లో ఆరోపించారు. ఇది జరిగిన కొద్ది కాలానికే విజయ్ ఒక శుభకార్యంలో హీరోయిన్ త్రిషతో కలిసి హాజరవటం సంచలనంగా మారింది. మరోవైపు విజయ్ కొడుకు కూడా అతనిని ఇన్ స్టాగ్రామ్ లో అన్ ఫాలో అయ్యి, తన పేరులోని విజయ్ ను తొలగించుకున్నారన్న వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారం మొత్తం వలన ఓటర్ల మనసులో, ముఖ్యంగా మహిళా ఓటర్లలో అతని ఇమేజికి చెడే కానీ మంచి అయితే జరగదు.

5. విజయ్ కు క్లీన్ ఇమేజ్ అయితే లేదు. తాను కొన్న అతి ఖరీదైన రోల్స్ రాయిస్ కారుకు పన్ను తప్పించుకోవటంకోసం తప్పుడు లెక్కలతో అఫిడవిట్ దాఖలు చేశారని ఆరోపణ ఉంది. దానిపై కోర్టులో కేసు ఇంకా నడుస్తోంది.

6. పార్టీ పెట్టి రెండేళ్ళు దాటినా, ఇప్పటికీ విజయ్ ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టిన పాపాన పోలేదు. మహా అయితే ఏదైనా విషయంపై స్పందించాలంటే వీడియో బైట్లు వదులుతున్నారు. ఇది ఆయనలోని ఆత్మవిశ్వాస లేమిని, నాయకత్వ లక్షణాల లేమిని చూపుతోంది. ఒక రాజకీయ నాయకుడు పార్టీ పెట్టి రెండేళ్ళు దాటినా ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడకపోవటం అనేది ఇప్పటివరకు దేశంలో ఎక్కడా జరగని విషయం.

ట్రయాంగిల్ ఫైట్..

కొన్ని దశాబ్దాలుగా రెండే ప్రధాన పక్షాల మధ్య ముఖాముఖి పోటీగా నడుస్తున్న ఎన్నికల పోరు, విజయ్ ప్రవేశంతో ఈ సారి ముక్కోణపు పోటీగా మారింది. అధికార డీఎంకే కూటమిలో కాంగ్రెస్, విజయకాంత్ పార్టీ, వీసీకే అనే దళితపార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ వంటి మొత్తం 14 పార్టీలు ఉన్నాయి. అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ, వన్నియార్ల పీఎంకే పార్టీ, టీఎంసీ వంటి 12 పార్టీలు ఉన్నాయి. విజయ్ పార్టీ టీవీకే మొత్తం 234 స్థానాలలో ఒంటరిగా పోటీ చేస్తోంది. పేరుకు ఇంకో పార్టీ ఎన్టీకే కూడా మొత్తం 234 నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నా, దాని ప్రభావం చాలా స్వల్పంగానే ఉంటుంది. కారణం – ఆ పార్టీ అధినేత సీమన్ ఎత్తుకున్న తమిళ జాతీయవాదం. 800 – 1000 సంవత్సరాలకు ముందునుంచి తమిళనాడులో ఉన్నవారే రాష్ట్రాన్ని ఏలాలి అనేది ఆయన వాదం. ముఖ్యంగా, 500 ఏళ్ళనుంచి తమిళనాడులో ఉంటున్న తెలుగువారు టార్గెట్ గా ఆయన ఈ జాతీయవాదాన్ని ప్రచారం చేస్తుంటారు. అయితే ఆ వాదానికి పెద్దగా సపోర్ట్ లేకపోవటంతో ఆయనకు 6 – 8 ఓట్ల శాతం మాత్రమే దక్కుతూ ఉంటుంది.

డీఎంకే ప్లస్, మైనస్ లు

డీఎంకే ప్రభుత్వ పాలనపై ప్రధానంగా వినబడే విమర్శ – శాంతి భద్రతల సమస్య. ఆడవారిపై, బాలికలపై అత్యాచారాలు, హత్యలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు గంజాయి వంటి మత్తుమందుల వాడకం తీవ్రంగా పెరిగింది. అవినీతి పెరిగిందనే ఆరోపణలు కూడా బాగానే వినబడుతున్నాయి. కావేరి డెల్టాలోని రైతులు కూడా ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. అయితే ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత కూడా లేదు.

డీఎంకే బలం ఆ పార్టీకి ఉన్న పటిష్ఠమైన వ్యవస్థాపక నిర్మాణం. అది కార్పొరేట్ స్థాయిలో సమన్వయంతో సాగుతూ ఉంటుంది. గత ఐదేళ్ళనుంచి సరిగ్గా పనితీరు కనబరచలేకపోయిన 60 మంది ఎమ్మెల్యేలకు ఈసారి టిక్కెట్లు నిరాకరించి, వారి స్థానాలలో కొత్తవారికి అవకాశం కల్పించారు. డీఎంకే మరోబలం క్రైస్తవ, ముస్లిమ్ ఓట్ బ్యాంకు. తమిళనాడులో మైనారిటీల ఓట్లు మొదటినుంచీ డీఎంకేకు పడుతూ ఉంటాయి. ఇక, అధినేత స్టాలిన్ తమిళనాడు హక్కులకోసం, డీలిమిటేషన్ కు వ్యతిరేకంగ కేంద్ర ప్రభుత్వాన్ని ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఎదుర్కోవటం కూడా ఒక పాజిటివ్ పాయింట్.

అన్నాడీఎంకే ప్లస్, మైనస్ లు

అన్నాడీఎంకేకు బలమైన సంప్రదాయ ఓట్ బ్యాంక్ ఉంది. ముఖ్యంగా మహిళల ఓట్లు ఎక్కువగా ఆ పార్టీకి పడుతుంటాయి. బీజేపీ భాగస్వామి కావటం మరో పెద్ద ప్లస్ పాయింట్. దీనివలన ఆర్థిక వనరుల సమస్య తలెత్తే సమస్యే ఉండదు. పళనిస్వామి, అన్బుమణి రాందాస్ వలన గౌండర్, వన్నియార్ ఓట్లు బాగానే చీల్చుకోగలుగుతారు.

అన్నాడీఎంకే మైనస్ లు చూస్తే, జయలలిత తర్వాత కరిష్మా ఉన్న పెద్ద నేత ఎవరూ లేకపోవటం ప్రధానమైన నెగెటివ్ పాయింట్. విజయ్ పెట్టిన కొత్తపార్టీ వలన అన్నాడీఎంకేకు పడవలసిన ప్రభుత్వ వ్యతిరేక ఓటులో గండి పడటం రెండో నెగెటివ్ పాయింట్. విజయకాంత్ పార్టీ ఎండీఎంకే ఈ కూటమినుంచి వైదొలిగి డీఎంకే కూటమిలో చేరటం మరో పెద్ద దెబ్బ. పళనిస్వామి వ్యవహారశైలికి నిరసనగా పనీర్ సెల్వం, సెంగొట్టయ్యన్ వంటి పలువురు సీనియర్ అన్నాడీఎంకే నేతలు బయటకు వెళ్ళిపోయారు. దేవర్, వన్నియార్ కులాలు అన్నాడీఎంకేకు దూరమయ్యాయి. ఏది ఏమైనా అన్నాడీఎంకే గ్రాఫ్ నానాటికీ తగ్గుతోందన్నది నిజం.

కుల ప్రభావం..

తమిళనాడు ద్రవిడ పార్టీలన్నీ సిద్ధాంతపరంగా కులరహిత సమాజం కావాలని ఘోషిస్తున్నప్పటికీ, అక్కడ కులాలే ముఖ్యపాత్ర పోషిస్తూ రావటం ఒక విచిత్రమైన పరిణామం. అయితే ఈ ఎన్నికలలో మాత్రం కులాలు అతి తక్కువ ప్రభావం చూపుతాయని అంటున్నారు. దానికి కారణాలను చూద్దాం. తమిళనాడులో ముఖ్యంగా ఉత్తరాన వన్నియార్ కులం, దక్షిణాన దేవర్ కులం, పశ్చిమాన గౌండర్ కులం ప్రధానంగా ఇప్పటిదాకా రాజకీయాలను శాసిస్తూ వచ్చాయి. అయితే ఆ పరిస్థితి ఇప్పుడు మారింది. ఏ కులం ఓట్లూ గంపగుత్తగా ఒకపార్టీకి పడేటట్లుగా ఇప్పుడు లేదు.

ఉదాహరణకు తీసుకుంటే – వన్నియార్ల ఓట్లన్నీ పీఎంకే పార్టీకి పడేవి. వన్నియార్ల పార్టీ పట్టాళి మక్కళ్ కచ్చి అధినేత రాందాసుకు, ఆయన సుపుత్రుడు అన్బుమణికి మధ్య విభేదాలు రావటంతో ఈయన ఒక కూటమిలోకి, ఆయన మరో కూటమిలోకి వెళ్ళారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లోనే పీఎంకే ప్రభావం దారుణంగా పడిపోయింది.

ఇక దేవర్ కులం సంగతి చూస్తే, ఇంతకుముందు దేవర్ల ఓట్లు గంపగుత్తగా అన్నాడీఎంకేకు పడేవి. దానికి కారణం ఆ కులానికి చెందిన ఓ పన్నీర్ సెల్వం, దినకరన్, శశికళ తదితరులు ఆ పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ ఉండటం. గౌండర్ కులస్థుడైన పళనిస్వామి అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీలో దేవర్ల ప్రాబల్యం తగ్గింది. దానికితోడు మాజీ ముఖ్యమంత్రి పనీర్ సెల్వం డీఎంకే పంచన చేరటంతో దేవర్ కులం ఓట్లు రెండు కూటముల మధ్య పంచుకోబడుతున్ననాయి.

పశ్చిమప్రాంతమైన కొంగునాడులో మొదటినుంచి గౌండర్ కులం ప్రాబల్యం బాగా ఉంటుంది. ఇది అన్నాడీఎంకే కంచుకోట. అయితే ఇటీవల గౌండర్ల ఓట్లు కొల్లగొట్టటంకోసం స్టాలిన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. సెంథిల్ బాలాజీ అనే మంత్రికి ప్రత్యేకంగా ఆ బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు గౌండర్ ఓట్లలో చీలిక కనపడుతోంది.

వర్తక వాణిజ్యాలలో ఎక్కువగా ఉండే నాడార్లు మరో పెద్ద కులం. కామరాజ్ నాడార్ కారణంగా వారు మొదటినుంచి కాంగ్రెస్ పార్టీతో ఉండేవారు. తర్వాత అన్నాడీఎంకేకు దగ్గరయ్యారు. కానీ, జయలలిత చనిపోయిన తర్వాత పార్టీలో గౌండర్, వన్నియార్ల ప్రాబల్యం పెరగటంతో అన్నాడీఎంకేకు దూరమయ్యారు. వారిని దువ్వటానికి డీఎంకే తీవ్రంగా ప్రయత్నిస్తోంది. డీఎంకే ఎంపీ కనిమొళి ప్రస్తుతం ఆ పనిలో ఉన్నారు. తెలంగాణ గవర్నర్ గా చేసిన తమిళిసై, తమిళనాడు బీజేపీ సీనియర నాయకుడు పొన్ రాథాకృష్ణన్ నాడార్ సామాజికవర్గానికి చెందినవారు. కాబట్టి నాడార్లలో కూడా గంపగుత్తగా ఒక కూటమికి ఓట్లు వేసే పరిస్థితి ఇప్పుడు కనబడటంలేదు. మొత్తం మీద చూస్తే గతంలోలా ఒక కులం ఓట్లన్నీ ఒక పార్టీకి పడే పరిస్థితి ప్రస్తుతం లేదని చెప్పాలి.

అన్నామలై

ఈ ఎన్నికల్లో అన్నామలైను పక్కన పెట్టటానికి ఒక కారణం వినబడుతోంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తే, ససేమిరా అంటూ అన్నామలై అడ్డుపడ్డారు, ఒంటరిగా వెళ్ళేలా చేశారు. తీరా చూస్తే ఫలితాలు నిరాశాజనకంగా వచ్చాయి. పొత్తు పెట్టుకుని ఉంటే మెరుగైన ఫలితాలు సాధించి ఉండేవాళ్ళమని భావించిన మోదీ-షా ద్వయం, అన్నామలైను పక్కనపెట్టి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతోపొత్తు పెట్టుకుంది. 2024లో ఆంధ్రాలో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కమలనాథులను ఒప్పించటం వలన జాతీయ స్థాయిలో బీజేపీ అధికారంలోకి రావటానికి మార్గం సుగమం అయితే, అన్నామలై మాట వినటం వలన చెడు జరిగిందని ఆ పార్టీ అధిష్ఠానం భావించినట్లుగా కనబడుతోంది.

అన్నట్టు, 2024 పార్లమెంట్ ఎన్నికలలో తమిళనాడులో డీఎంకే కూటమి 100% స్ట్రైక్ రేటుతో మొత్తం 39 స్థానాలనూ చేజిక్కించుకుంది. మొత్తంమీద, ప్రస్తుతం తమిళనాడులో ప్రభుత్వ వ్యతిరేక ఓటు అన్నాడీఎంకే కూటమికి, విజయ్ టీవీకే పార్టీకి మధ్య చీలుతుంది కాబట్టి డీఎంకే కూటమికి ప్రయోజనం చేకూరుతుందని స్థూలంగా చూస్తే అనిపిస్తుంది. అయితే డీఎంకేకు సంప్రదాయంగా పడుతూ వస్తున్న మైనారిటీ ఓటులో  విజయ్ గణనీయంగా చీల్చగలిగితే మాత్రం డీఎంకేకు కష్టమవుతుంది. అయితే ఇదంతా విజయ్ ను ఒక సీరియస్ రాజకీయ నాయకుడిగా జనం పరిగణనలోకి తీసుకుంటే ఏర్పడే పరిస్థితి. అతని మాటలను, చేతలను బట్టి, జనం సీరియస్ గా తీసుకోకపోతేమాత్రం డీఎంకేకు నల్లేరు మీద నడకే అవుతుంది.