శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రారంభోత్సవం
వాసవీ మాతను ఆదిపరాశక్తి స్వరూపంగా భక్తులు కొలుస్తారు

మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య
కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, చల్లగా ఉండాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్ పేట్ డివిజన్ పరిధిలోని జిల్లెలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సమీపంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ చైర్మన్ తేరటిపల్లి శ్రీనివాస్ గుప్తా, అధ్యక్షుడు పచ్చిపులుసు శ్రీరామచంద్రమూర్తి గుప్తా, ప్రధాన కార్యదర్శి ఇరువెంటి సురేష్ గుప్తా, కోశాధికారి గందె వెంకటేశ్వర్లు గుప్తా, కమిటీ సభ్యులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు, శ్రీ గణపతి స్వామి, స్పటిక లింగ సహిత సరస్వతి దేవి విగ్రహాల ప్రతిష్టాపనతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. విచ్చేసిన భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పట్లోల్ల సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర బీజేపీ కో-ఆపరేటివ్ సెల్ కన్వీనర్ కొలన్ శంకర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. స్త్రీల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన కలియుగ పార్వతీదేవీగా అమ్మవారిని భక్తులు కొలుస్తారన్నారు. అహింస, ఆత్మ త్యాగం, శాంతి, ధర్మ నిరతికి ప్రతిరూపం అమ్మవారు. దేశవ్యాప్తంగా ఆర్య వైశ్యులతో పాటు అన్ని వర్గాల ప్రజలు అమ్మవారిని కొలుస్తారన్నారు. వైశ్యులంతా ఐక్యమత్యంగా ఉండి వాసవి మాత జయంతిని ఘనంగా నిర్వహించుకోవాలని తెలిపారు. వాసవి మాత సంకల్పంతోనే దేవాలయ నిర్మాణాన్ని నిర్మించడం జరిగిందని, ఆ నిర్మాణంలో తన పాత్ర ఉండడం ఎంతో సంతోషమని అన్నారు. దేవాలయ నిర్మాణానికి కమిటీ సభ్యులు ఎంతో కష్టపడ్డారని, వారు ఎన్నో జన్మల పుణ్యఫలం వల్లనే ఈ సంకల్పం నెరవేరిందని అన్నారు. మీర్పేట, బడంగ్ పేట, జల్పల్లి ఆర్యవైశ్య సంఘాలన్నీ ఐక్యంగా ఉండాలని సూచించారు. అనంతరం మిషన్ భగీరథ కార్పోరేషన్ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ గుప్తా మాట్లాడుతూ.. ఈ వాసవి మాత దేవాలయ నిర్మాణానికి భూమి కేటాయించిన సబితా ఇంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వైశ్య పేద విద్యార్థుల చదువు కోసం బాలాపూర్ మండలంలో ఓ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తే తనవంతుగా రూ. 50 లక్షలు అందజేస్తానని సభా ముఖంగా తెలియజేశారు. అందులో ఆర్యవైశ్య పేద విద్యార్థులతో పాటు, సమాజంలోని పేద వర్గాలకు కూడా స్థానం కల్పించి విద్యను అందజేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వీరమల్ల రామనరసింహ గౌడ్, మీర్ పేట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆర్కల కామేష్ రెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు ఆర్కల భూపాల్ రెడ్డి, ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్, నాయకులు పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సిద్ధాల అంజయ్య, యాదగిరి, మహిళా విభాగం అధ్యక్షురాలు సునీత బాల్ రాజ్, గీత, అనుబంధ సంఘాల అధ్యక్షులు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
